Tuesday, March 30, 2010

ఒక్క పుస్తకం మీ జీవితాన్ని మార్చేస్తుంది.............. !

అనగనగా ఒక ఆర్కుట్ ప్రొఫైల్. అందులో ఒక అమ్మాయి. ఏదొ తనగురించి నాలుగు ముక్కలు రాసుకుని, కొన్ని ఫొటోలు (చెట్లవీ పుట్టలవీ - అప్పటికి ప్రైవసీ పాలసీ లేదు మరి) పెట్టుకుంది. ఒక రోజు ఒక అబాయి స్క్రాప్ వచ్చింది మీ ఫొటొలు బాగున్నాయీ అని. సరె, ఎదొ స్క్రాప్ వచ్చింది కదాని రిప్లై ఇచ్చింది థాంక్యూ అని. తరువాత రోజు మళ్ళీ అబ్బాయి... మళ్ళీ ఒక పదం రిప్లై... ఇలా ఒక నాలుగు రోజులయ్యాక, ఈ జీవి ఎవరో చూదాం అని ఆ అబ్బాయి ప్రొఫైల్ ఓపెన్ చేసింది. మామూలు అబ్బాయి ప్రొఫిలె...నేను ఆహా నేను ఓహో.... అని ఉంది...కాని బుక్స్: అనె దగ్గర "so and so" అని పెరు చూసి ఆగింది ! ఇప్పుడు అమ్మాయి స్క్రాప్ "హెయ్, మీరు ఈ so and so రైటర్ బుక్స్ ఎమి చదివారు?"--"xyz", "చాలా మంచి బుక్" -- "అవును", ఇలా వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యారు... ఇప్పుడు మన టపా ఆ అబ్బాయి / అమ్మాయి గురించి కాదు, ఆర్కుట్ గురించి అసలే కాదు. ఆ "so and so" రైటర్ "వెరా పనోవ" ఇంకా ఆ "xyz" బుక్ "పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు".

సెర్యొష కి ఆరేళ్ళొస్తాయి. మరి ఆరేళ్ళ పిల్లడి జీవితంలో అన్నీ వింతలే, విశేషాలే, రోజూ అద్భుతాలే. మన సెర్యొష జీవితం కూడా అంతే. వాడికి అమ్మ ఉంది(నాన్న లేడు యుద్ధంలో చనిపోయాడు), మామయ్య, అత్తయ్య ఉన్నరు ఇంకా బోలెడు దోస్తులున్నారు. వాళ్ళ ఊరిని చిన్న ఊరు అనేఅంటారు అందరూ కాని సెర్యొషకి అది నమ్మసక్యం గా ఉండదు. వాడికి వాడి ఊరు పెద్ద పట్నమే. సెర్యొష మన బుడుగులా అస్సలు కాదు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు. వాడి బుర్ర ఒక సందేహాల పుట్ట. వాడికి కథలంటె మహా ఇష్టం, కాని వాడికి కథ చెప్పటం చాలా కష్టమే, ఎందుకంటే వాడికి ఆ కథలనీ ముందే తెలుసాయె. కథలో ఒక్క ముక్క అటూ ఇటూ ఐనా ఊరుకోడు మరి. ఈలోగా వాడి జీవితంలో ఒక గొప్ప విశేషం జరిగింది- వాడికి నాన్న వచ్చాడు.

మరి, తనకి నాన్న ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? అని ఆలోచనలో పడిన సెర్యోషకు, నాన్న ఉంటేనే మంచిదేమోలే అనిపిస్తుంది. వాడి నేస్తులు కూడా వాడి ఉద్దేశాన్నే బలపరుస్తూ అంటారు " ఒరే, నీకు ఏమీ పర్వాలేదురా, మీ కొత్త నాన్న మంచివాడేలే, నీకు మరేమీ తేడా ఉండదు రా". ఈ పుస్తకం అంతా సెర్యొష కీ వాళ్ళ కొత్త నాన్నకీ ఉన్న బంధాన్ని, అది ఎలా ఏర్పడిందీ అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అది కూడా సెరొష కళ్ళతోనే చూపిస్తుంది. తనకు కావాల్సిన ఆట బొమ్మ విషయం నుంచి, చెల్లి కావాలా తమ్ముడు కావాలా అనే విషయం వరకూ, తను ఎప్పుడైనా చనిపోతాడా అనే సందేహం నుండి, షాపులో అటెండరు అంటె ఎవరు అనే విషయం వరకు... సెర్యోషకు సంబంధించినా ప్రతిచిన్న నలుసు విషయంలోనూ వాళ్ళు ఎలా ఒక్కోమెట్టు కలిసి ఎక్కారో అని ఈ పుస్తకం చెప్తుంది. ఇక సెర్యోష జీవితం లోని ప్రతీ విషయంలోను వాడి కొత్త నాన్న ఎలా ఇంఫ్లుఎన్స్ చెసాడు అనేది ఈ చిన్న పుస్తకంలోని విషయం.

ఈ పుస్తకం, ఒక చిన్న పిల్లడి ద్రుష్టి నుంచి రాసిన, ఆ కాలంలోని కుటుంబ మరియు సంఘ జీవితాన్ని బాగా ప్రతిబింబిస్తుంది. సెర్యొష వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం అంతస్థు, పలుకుబడీ ఉన్నవాళ్ళైనా వాడి నేస్తులు మాత్రం అన్ని రకాల వాళ్ళూ - తల్లీ, తండ్రీ లేక పెత్తల్లితో ఉండే జేన్య నుంచీ... మాహాసముద్ర నౌకాయానంలో పెద్ద కేప్టేన్ ఐన మామయ్య ఉన్న వాన్య వరకూ - ఉంటారు. ఇకపోతె, మన వాడికి అత్యంత ప్రియ మిత్రుడు షూర వాళ్ళ నాన్న లారీ డ్రైవరు, ఇంక పక్కింటి లీదా ప్రపంచంలో అందరికన్నా పెద్ద చాడీకోరు ! ఇక, కొత్త నాన్నతో వచ్చిన కొత్త చుట్టం ముత్తవ్వ చనిపోయినప్పుడు చేసే అంత్య క్రియలు, వాస్య మామయ్య రావటం, పచ్చబొట్ల ప్రహసనం, వాడికి జబ్బు చెయ్యటం , జైల్లోపడి వచ్చిన అతనితో సంభాషణ, శీతాకాలం వల్ల వచ్చే అంతులేని విసుగు... ఇలా ప్రతి రోజు వాడితో పాటు మనం కూడా నడుస్తూ ఉంటాం. వాడికి కలిగే ప్రతి అనుభూతీ, మనంకూడా అనుభూతిచెందుతూ ఉంటాం. చిట్ట చివర, వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి, వాడిని వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కూడా వాడితో పాటు ఒక్క కన్నీటిబొట్టు కారుస్తాం.

వేరా పనోవ పేద్ద రచయిత అవునో కాదో నాకు తెలియదు (రష్యాలో మాత్రం ఆవిడకి కొన్ని అవార్డులు వచ్చాయి అని చదివాను). ఆవిడ పుస్తకాలు నేను రెండే చదివాను. కాని రెండూ నాకు చాలా నచ్చాయి. ముఖ్యంగా "పెద్ద ప్రపంచం లో చిన్నపిల్లడు" చాలా ఆర్ధ్రమైన పుస్తకం. చిన్న పిల్లల సాహిత్యం అంతే నాకుగుర్తువచ్చే పుస్తకాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకం రాదుగ వారి ప్రచురణ నాదగ్గర ఉంది (పదిహేనేళ్ళ క్రితం విశాలాంధ్ర బుక్ షో లో కొన్నాను). ఇప్పుడు ప్రచురణలో ఉన్నదని అనుకోను.

పుస్తకంలో నాకు నచ్చిన ఇంకొన్ని విషయాలు:

పుస్తకమంతా సెర్యోష మాటల్లోనే ఉంటుంది. అంటె, ప్రతి పాత్రా, అమ్మ, పాష అత్తయ్య, తోస్య అత్త... ఇలా... మనం పుస్తకమంతా వాడి కళ్ళతోనే చూస్తాం.

చాలా చిన్న పుస్తకం ఐనా, చలా విషయాలు కవర్ చేసినట్టు అనిపిస్తుంది. అంటె, వాడి దొస్తులు, ఆటలు, ఆశలు, ప్లానులు, ఆలోచనలు, సందేహాలు ఇంకా చాలా చాలా...

చిన్న పిల్లల కోసం రాసిన పుస్తకమే ఐనా, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చేవిధంగా ఉంటుంది. (ఈ పుస్తకాన్ని నెను గత పదిహేనేళ్ళలో చదివిన ప్రతిసారీ ఒకేరకమైన ప్లెజర్తో చదివాను).

ఇంక అన్నింటికన్నా నాకు నచ్చే అతి ముఖ్యమైన విషయం.... అన్ని రష్యన్-తెలుగు అనువాదాల లాగానే, ఈ పుస్తకంలో భాష కూడా చాలా అద్భుతం గా ఉంటుంది.
*************************************************************************************
అది సరే, కాని ఆ టపా టైటిల్ ఏంటి? దానికీ దీనికీ లంకె ఏంటి? ఆ ఆర్కుట్ అబ్బాయి అమ్మయి ఏమయ్యారు అంటారా ??? ఈ వారాంతానికి మా పెళ్ళయ్యి రెండేళ్ళు ;)