Wednesday, December 21, 2011

నేను సైతం .... పుస్తక ప్రదర్శనకు ...

హమ్మయ్య! మొత్తానికి ఎలాగైతేనేం నేను కూడా వెళ్ళొచ్చేసా పుస్తకాల పండుగకు. నాకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన గురించి 2009 నుంచీ తెలిసినా, కరకరాల కారణాల వల్ల ఇప్పటివరకు వెళ్ళటం కుదరలేదు. అసలు ఈ సంవత్సరం కూడా కుదురుతుందనైతే అనుకోలేదు. మొన్న ఆదివారం మా చర్చ్ క్రిస్మస్ వల్ల గత నెల నుండీ ప్రతీ వారాంతం అస్సలు ఖాళీ లేకుండా ఉంది. మళ్ళీ రెండు రోజులకి పండక్కి ఇంటికి వెళ్ళిపోతున్నా... ఈ మూడు రోజుల, అదీ అన్నీ వారపు రోజుల విండోలో అస్సలు వెళ్ళలేనేమో అనుకున్నా. కాని, మొన్న ఆఫీస్ డుమ్మాకొట్టి మరీ వెళ్ళొచ్చెసా :)     
   
అసలు మూడేళ్ళనుంచీ వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఇదే గాని, వెళ్ళి ఏమి కొనాలి అని పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే, బ్లాగులు చదవడం మొదలుపెట్టినప్పటినుంచీ బాగా అర్ధం అయింది, మన తెలుగు సాహిత్య పాండిత్యం అంతా ఒట్టి గుండు సున్నా అనీ, ఏం చదివినా, ఓం ప్రధమమే అనీ. కాబట్టి ముందుగా ఏమీ అనుకోలేదు. కాని, వెళ్ళడం కంఫర్మ్ అవ్వగానే మాత్రం మనసులో మెదిలిన పుస్తకాలు శ్రీ రమణ గారి "మిథునం", "వేలుపిళ్ళై" ఇంకా, "ఇల్లేరమ్మ కథలు" (లిస్ట్ కర్టెసీ నెమలికన్ను బ్లాగు). సరే, మిట్టమధ్యాహ్నం, రెండింటికి మా వూళ్ళో బయలుదేరితే, అక్కడికి చేరేసరికి మూడు కొట్టింది. పార్కింగు కష్టాలు దాటి, టిక్కెట్ కొని, పక్కనే ఉన్న దారిలో దూరబోతుంటే, ఆపి, అటువైపు ఎంట్రన్సు అని చెప్పారు. ఆహా! ఎన్నాళ్ళకు వచ్చాను అనుకుని కుడికాలు లోపలికిపెట్టి వెళ్ళాను. అసలు పుస్తకాలు కొనడం, చదవటం ఒక ఎత్తైతే, జస్ట్ ఆపుస్తకాలు అలా చూస్తూ, పేజీలు తిప్పుతూ, ముందు మాటలూ వెనక మాటలూ చదువుతూ, సెకెండ్ హాండ్ పుస్తకాల దుమ్ముకి తుమ్ముతూ అలా అలా తిరగటం నాకు చాలా ఇష్టం.

సరే, వెళ్ళగానే ముందు స్వాగతం చెప్పినవి నానా రకాల న్యూస్ పేపర్ స్టాల్సు. వాటిని దాటుకుని ముందు వెళ్ళ్తుంటే, ఒక యోగి ఆత్మకథ వాళ్ళ స్టాలు ఇంకా నిత్యానంద స్టాలు కనిపించాయి. ఇక పుస్తకాల స్టాళ్ళలో పబ్లికేషన్సువే కాకుండా పుస్తకాల షాపులవి కూడా ఉన్నాయి. ముందే అనుకున్నట్టు, ఇంగ్లీషు పుస్తకాల దగ్గర ఆగకుండా తెలుగు పుస్తకాల దగ్గరే ఆగాము. నేను చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పారావ్ చెయ్యి పట్టుకుని ఆపారు- తెలుగు పుస్తకాలో అన్నావ్ మరి ఎమ్మెస్కో దాటుకుని వెళ్ళిపోతున్నావు అని. అరే, చూస్తే అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ముందు వరసలో ఉన్నాయి, తెలుగు పుస్తకాలు వెనక ఉన్నాయి. ఇక అక్కడి నుంచీ అన్ని తెలుగుపుస్తకాల స్టాళ్ళూ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. వంశీ పుస్తకాలూ, కోతికొమ్మచ్చి, ఇల్లాలి ముచ్చట్లూ, రంగనాయకమ్మలూ ఇంకా యండ్మూరీ, యుద్ధనపూడీ, చలం  ఇలాంటివి చాలా స్టాళ్ళల్లో ఉన్నాయి. మంచి పుస్తకం వారి స్టాల్ కనిపించింది. మీ గురించి నేను బ్లాగుల్లో చదివానండీ అని చెప్పాను. కాని అక్కడేమీ కొనలేదు (కూతురు ఇంకా చదవలేదు కదా). ఆగొద్దు అనుకుంటూనే ఒక ఇంగ్లీష్ పుస్తకాల స్టాల్ దగ్గర ఆగాము. అన్నిటికన్నా పైన 1984 - జార్జ్ ఆర్వెల్ ఉంది. సరే అని నేను తీసుకున్నా...అప్పారావు కూడా ఏదో తీసారు. మొత్తానికి ఇద్దరం ఇంగ్లీష్ లోనే బోణీ కొట్టాం.

అప్పటికే చాలా టైము అయినట్టనిపించింది. ఇక త్వరత్వరగా చూస్తున్నా... ఒక దగ్గర శ్రీ రమణ పుస్తకాలు కనిపించాయి కాని, మిథునం లేదు. అక్కడే నాకు ఇల్లేరమ్మ కథలు దొరికింది. పక్కనే "రైలు బడి" కనిపిస్తే, ఎప్పుడో ఆపుస్తకం గురించి చదివినట్టు గుర్తు వచ్చి తీసుకున్నా. హ్మ్మ్... నా తెలుగు బోణీ కూడా అయింది. ఆ... ఆ మధ్య కినిగె స్టాలు కనిపించింది కాని ఆగలేదు. ఇక మా అప్పారవుకి కాల్స్ రావడం మొదలైంది. నాకు టెన్షన్ మొదలైంది. అయ్యో ఇంకా మిధునం దొరకనే లేదు, విశాలాంధ్ర స్టాలు చూడనే లేదు  అనుకుంటూ వేగం పెంచాను. ఒక పిల్లల పుస్తకాల స్టాల్ లో పాప కోసం ఏవో బొమ్మల పుస్తకాలు తీసుకున్నాం ఏదైనా 30 అంట! పాల పిట్ట దగ్గర యమకూపం, తణాయి కనిపించాయి. ఎదురుగా గొల్లపూడి వెంకటరమణ & సన్స్ స్టాల్ ఉంది. చిన్నప్పటి హాతింతాయి కథలు, సింద్బాద్ యాత్రలూ, సహస్ర శిర్స్చేద అపూర్వ చింతామణి కథలూ గుర్తు వచ్చాయి గాని, అవేవీ ఇక్కడ లేవు. ఇంక అప్పారావు విశాలాంద్ర స్టాలు ఎక్కడ అని అడగడం వినిపించింది. ఇంక లాభం లేదు అని డైరెక్టుగా అక్కడికే వెళ్ళాం.

వెళ్తూనే అడిగేసాను మిథునం ఉందా అని. ఒక్క నిముషం అని స్టాలు అవతలి కొసన ఉన్న ఎవరినో అడిగారు అరిచి- మిథునం అంట మాడం కి అని. నేను అటువైపు వెళ్ళాను. వాళ్ళు వేరే స్టాలు వాళ్ళని అడిగారు అరిచి- మాడం కి మిథునం అంట అని... సరిపోయింది, విశాలాంధ్ర దగ్గిర దొరకకపోతే ఇంక దొరకదేమో అనేసుకున్నా. ఎదురు స్టాలుకి వెళ్తే, ఉంది మాడం అని అతను వెతుకుతున్నాడు. నేనూ వెతుకుతున్నా... ఊహూ! ఇక్కడే ఉండాలి మాడం, ఐపోయాయనుకుంటా. ఉసూరుమని మళ్ళీ విశాలాంధ్రకు వచ్చాను. వెళ్దామా అని అప్పారావు... మ్మ్... చుట్టూ దిక్కులు చూస్తూ నేను. కొంచెం దూరంలో నవోదయ వారి స్టాలు కనిపించింది. మీరు ఇక్కడే ఉండండి లాస్ట్ ట్రయల్ చూసి వస్తా అని వెళ్ళాను. మిథునం ఉందా? ఉంది మాడం... లోపల చూడండి...నాకు కనిపించట్లేదు... సరిగ్గా మీ ఎదురుగా ఉంది చూడండి... ఆ... దొరికింది. చిన్న పుస్తకమే. చాటంత ముఖం చేసుకుని పుస్తకం పట్టుకుని వచ్చా. బిల్ పే చేసేసినా వదలకుండా పుస్తకం చేతితోనే పట్టుకుని వున్నాను. మళ్ళీ విశాలాంద్రకు వెళ్ళి, వేలుపిళ్ళై ఉందా అని అడిగాను. ఆ... ఉంది మాడం అని టక్క్ మని తీసిచ్చారు. ఇందాక ఎక్కడో చూసిన ఇల్లాలి ముచ్చట్లు ఇక్కడ కూడా కనిపించడంతో అది కూడా తీసుకున్నా... అప్పారావు కూడా వేరే ఏవో తీసుకున్నట్టున్నారు. బిల్ ఇచ్చి బయటకి నడుస్తుంటే, పక్కన ఉన్న ఇంగ్లీష్ స్టాల్ లో Angela's Ashes కనిపించింది. దాని రివ్యూ కూడా చదివినట్టు గుర్తు వచ్చి అది కూడా తీసుకున్నా... మొత్తానికి ఇంగ్లీష్ లో బోణీ కొట్టి ఇంగ్లీష్ లో ముగించాం.

ఎలాగూ ఆఫీస్ డుమ్మా కాబట్టి దారిలో ఒక నాలుగైదు మజిలీలు చేసుకుంటూ ఇల్లు చేరేటప్పటికి ఏడున్నర. ముందు వెళ్ళగానే, కూతురు కోసం కొన్న పుస్తకాలు దానికిచ్చి, అవి చదివి(బొమ్మలు చూపించి), ఆ పుస్తకాల మీద ఉన్న పుసలతో ఆడించి, ఒక అరగంట తరవాత నా పుస్తకాలూ, అప్పారావు పుస్తకాలూ సర్దుతుంటే ఏంటో తక్కువ అనిపించాయి. చూస్తే విశాలాంధ్రలో కొన్న పుస్తకాలు లేవు. కార్లో వదిలేసామేమో అని చెక్ చెసుకుంటే అక్కడా లేవు. అయ్యో ఇంతా చేసి అక్కడే మర్చిపోయాము అని నేను ఏడుపు మొఖం పెట్టాను. పోనీలే నేను రేపు మళ్ళీ వెళ్ళి తెస్తాను. మనం అంత సేపు అక్కడున్నాము కదా, మనని మర్చిపోరు, పుస్తకాలు వుంచుతారులే అని అప్పారావు చెప్పినా, నా మనసు మనసులో లేదు. నిన్న పాపం తను మళ్ళీ అంత దూరం వెళ్ళి ఆ పుస్తకాలు వున్నాయి నువ్వు గాభరా పడకు అని కాల్ చేసేవరకు నాకు తృప్తి లేదు. రాత్రి ఆఫీస్ నుంచి వెళ్ళగానే నా పుస్తకాలు చూసుకుని అప్పుడు స్థిమిత పడ్డాను. ఆఖరకి వచ్చేసరికి టైము సరిపోకపోయే సరికి, ఇ-తెలుగు స్టాలుకి వెళ్ళటం కుదరలేదు. వెళ్తే ఎవరైనా బ్లాగర్లు కలుస్తారేమొ అనుకున్నా. కాని వాళ్ళు నాకు తెలియొచ్చు గాని, నేను వాళ్ళకు తెలియదు కదా! సరే, వీలుంటే మళ్ళీ వచ్చే యేడు !  ఈ సారికి పుస్తక ప్రదర్శనకి వెళ్ళగలిగాను, అదే పదివేలు. 

p.s: మిథునం చదివేసా... :)                           
                          

Tuesday, November 1, 2011

మూడు పుస్తకాలు ముప్ఫై రూపాయలు.........

అసలు ఈ శీర్షిక ఆరు పుస్తకాలు అరవై రూపాయలు ఆని ఉండాల్సింది. కానీ.....

ఈ మధ్యనోసారి కొండాపూర్ రోడ్డు మీదవెళ్తూంటే కనిపించింది, చిన్న సందులాంటి పుస్తకాల షాపు. అసలు చెప్పాలంటే, సందు కూడా కాదేమో, ఒక మెట్ల వరసకింద స్థలం+ ఒక మనిషి మాత్రమే దూరగలిగే సందు. ఇదీ ఆ షాపు. నేను చూడకుండా వెళ్ళిపోయేదాన్నే, కాకపోతే ఆ రోజు కాస్త తీరికగా నడుస్తున్నానేమో, రోడ్డు మీద నిలబెట్టిన పుస్తకాల స్టాండు చూసి ఆగాను. సెకండు హాండ్ వి, ఇంకా కొత్తపుస్తకాలు కూడా వున్నట్టే అనిపించాయి. నేను పేర్లు చదువుతుంటే, షాపువాడు లోపలికి రమ్మని ఆహ్వానించాడు. సరే చూద్దాం అని జాగ్రత్తగా సందులోకి దూరితే, లోపల చాలానే పుస్తకాలు ఉన్నాయి ఒక అర నిండా తెలుగు పుస్తకాలు కనిపిచే సరికి వెంటనే నేను బ్ల్లాగుల్లో చదివిన తెలుగు పుస్తకాల సమీక్షలూ గుర్తువచ్చి, నేను కూడా తెలుగు సాహిత్యాన్ని ఆదరించే టైము అర్జంటు గా వచ్చేసిందని నాకు అర్ధమైంది.

కాని అసలు చిక్కు అక్కడే వచ్చింది! ఆ తెలుగు పుస్తకాల అర నిండా కొట్టొచ్చినట్టు కనపడుతున్నవి మూడే పేర్లు, యండమూరి, యుద్ధనపూడి, ఇంకా మధుబాబు. మధుబాబుని ముందు లిస్ట్లోనుండి తీసేయొచ్చు, కానీ మరీ యండమూరి, యుద్ధనపూడి అంటే? నా తెలుగు సాహిత్య పఠనారంభం మరీ ఇంత నాటకీయం గా ఉందాలా అని తీవ్రంగా ఆలోచించుతుంటే, అప్పుడు కనిపించింది, ఒక మూలగా తోసేసిన పుస్తకం. మన నెమలికన్ను గారి అభిమాన రచయిత విరచితం....మహల్లో కోకిల. గమనిక : నాకు తెలుగు సాహిత్యం గురించి తెలిసింది చాలా తక్కువనిన్నూ, మరియు, నాకు తెలిసిన పుస్తకాలు/రచయితలు చాలా వరకు నెమలికన్ను బ్లాగు ద్వారానే తెలిసినవనిన్నూ నా గోల వాటిగురించే అనిన్నూ ఇందుమూలంగా యావత్ నాబ్లాగు చదువరులకు తెలియపరచడమైనది.

 మహల్లో కోకిల: పుస్తకం డెబ్భై రూపాయలు. దీని మీద డిస్కౌంట్ ఉందా అని అడిగితే, అరవై ఇవ్వండి మాడం, యాభై తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు షాపు వాడు. ఒహ్హో! ఇక్కడ పుస్తకాలు అద్దెకి ఇస్తారన్నమాట! అప్పుడు వెలిగింది నా ట్యూబు లైటు. సరె, మరి పుస్తకం నచ్చితే, అరవై రూపాయలకు ఉంచేసుకోవచ్చు లేకపోతే, రెండు వారాల్లో తిరిగిచ్చేయాలి. ఓక్కే అని పుస్తకం తీసుకుని బయట పడ్డాను. పుస్తకం గురించి చెప్పడానికి నాకు పెద్దగా ఏమీ లేదు గాని, కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి. ముఖ్యం గా నాయిక గారు, ఆ పగటి వేషగాడితో(రాముడు?) అంత ఎక్కువ అటాచ్మెంటు అంత తక్కువ టైములో కలిగించుకోవటం కన్విన్సింగ్ గా లేదు. సరే, మళ్ళీ ఆదివారం పుస్తకం ఇచ్చ్ద్దామని వెళ్ళాను. అదిగో అప్పుడు వచ్చింది నాకీ అద్భుతమైన అవుడియా !!! ఆ షాపు వాడిచ్చే యాభై తీసుకోకుండా మళ్ళీ ఇంకో పుస్తకం అలా అలా అరవై అయ్యే వరకు ఆరు పుస్తకాలు చదివేసి, ఆరు పుస్తకాలు - అరవై రూపాయలు అని టైటిల్ తో ఒక టపా వెయ్యాలని. దాన్లో ఆ ఆరు పుస్తకాలనీ మరీ నాలుక తిరిగిన విశ్లేషణ కాకపోయినా ఏదో నాకొచ్చినట్టు విశ్లేషించాలనీ....

ఒక పుస్తకం ఐపోయింది కాబట్టీ ఆ తరవాత ఏం తీసుకోవాలీ అని తెగ చించడం మొదలుపెట్టాను. పుస్తకాల అర చూస్తే ఒకే పేరు మళ్ళీ మళ్ళీ నా కళ్ళల్లో పడుతూంది. ఎంత కాదనుకున్నా, తెలుగు వాళ్ళని ఒక టైములో ఉర్రూతలూపిన పాపులర్ రచయిత, ఇంకా ఈ మధ్యనే నటుడు కూడానూ ఐన యండమూరి గారి ని ఇంక తప్పించుకోలేను అనిపించింది. అతని పుస్తకాలన్నిట్ల్లోను మంచిది, పాపులర్, ఇంకా మందాకిని అనబడే నాయిక ఉన్న "ఆనందోబ్రహ్మ" తీసుకోవడం జరిగింది. ఈ పుస్తకం వెల అరవై, కాని పది డిస్కౌంటు పోను యాభై కాబట్టి, షాపువాడికి నాకు మధ్య ఏ విధమైన ఆర్ధిక లావాదేవీలు లేకుండానే, పుస్తకం నా చేతికొచ్చింది. ఈ పుస్తకం ద్వారా నేను తెలుకున్న కొన్ని పచ్చి నిజాలు:
 తెలుగులో ఎన్నో సంవత్సరాల క్రితమే సైన్సు ఫిక్షన్ రాయబడింది (కథా కాలం 2050 లో మొదలైయ్యింది మరి)
ఆ రోజుల్లో కూడా మాఫియా గూండాల్ని వాళ్ళు పెట్టుకునే టోపీల ద్వారా గుర్తు పట్టొచ్చు.
అప్పటికల్లా మంగలివాళ్ళు పెద్ద కోటీశ్వరులు ఐపోతారు (ఇప్పటికే అది జరిగేట్టుంది- మొన్న నేను హైర్ కట్ చేయించుకున్నపుడు వచ్చిన బిల్ చూస్తే)
ఇంకా, ఆ రోజుల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ మధ్య శారీరక సంబంధాలూ, అవి తల్లిదంద్రులకు తెలియడాలూ, లెక్క తప్పినప్పుడు అబార్షన్లూ అన్నీ కామన్ అయిపోయినా, ఒక వేళ అబార్షన్ ఇష్టం లేకపోతే, ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలి.
ఇంకా చాలా.... కాని ఒకటి మాత్రం నిజం, ఈ పుస్తకం నన్ను అంతగా నిరాశపరచలేదనే చెప్పాలి.

       మళ్ళీ ఆదివారం, ఈ సారి ఆన్ ద ఫ్లై కాకుండా, ముందే ఏ పుస్తకం తీసుకోవాలో అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని, బ్లాగులు ముందేసుకుని కూర్చున్నా. తీవ్రంగా గాలించి ఒక లిస్ట్ తయారు చేసా... ఆ లిస్ట్ నాలాగా తెలుగు సాహిత్యాన్ని ఆదరిద్దామనుకునే వారి సౌలభ్యం కోసం ఇక్కడ: " వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి", "సెక్రెట్రీ - యుద్ధనపూడి", "అందమైన జీవితం - మల్లాది" (ఇక్కడ నాకో సందేహం.... చాలా మంది మల్లాదిలు కనిపిస్తున్నారు. ఈ పర్టిక్కులర్ రచయిత పూర్తిపేరు? ) సరే, లిస్ట్ చేతధరించి పొత్తముల షాపునకేగితిని ! కానీ అయ్యో ! యుద్ధనపూడి, మల్లాదిల పుస్తకాలు(లిస్ట్లోవి) అక్కడ లేవు. అయ్యారే, ఏమి సేయవలయును ? నెను, పుస్తకాలు షాపు వాడూ దీక్షగా ఎంత వెదికిననూ తుమ్ములు వచ్చుచున్నవి తప్ప పుస్తకములు దొరుకుటలేదు. హ్మ్మ్... ఇంక నా ఆఖరి ప్రయత్నం గా యండమూరివారిని మళ్ళీ ఆహ్వానించక తప్పలేదు. ఈ సారి నాతోపాటు ఇంటికొచ్చింది వెన్నెల్లో ఆడపిల్ల ! ఈ సారీ నన్ను రచయిత నిరాశపరచలేదనే చెప్పాలి. నాకు తెలీని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ముఖ్యం గా, రచయిత దగ్గర, చెస్స్ లోనూ, టెలిఫొన్ ఎక్ష్చేంజ్ రంగంలోను ఇంకా గణితంలోను మంచి సమాచారం ఉంది.ఆ రోజుల్లో ఒకే ఊరిలోని టెలెఫొన్ నంబర్లు వేరే వేరే అంకెలతో మొదలయ్యేవి....

 నేను పుస్తకం మార్చ వలసిన ఆదివారం వచ్చేసింది గాని, నా చిన్న బుర్ర ఇంక నేను ఈ సమాచార భాండాగారాల్ని భరించలేనూ అని మొర్ర పెట్టడం మొదలెట్టింది. సరే, ప్రస్తుతానికి ఒక విరామం ప్రకటిద్దాం అని, ఆడపిల్లని జాగ్రత్తగా దిగబెట్టి, నా ముప్పై రూపాయలు పుచ్చుకుని, షాపు వాడు నిరాశగా చూస్తుండగా బయటికొచ్చేసాను. కాని, కనీసం ఈ మూడు పుస్తకాలతోనైనా టపా రాస్తే, నేను పడిన శ్రమకు అర్ధం పరమార్ధం ఉంటాయని.... ఇలా....
ఇంతే సంగతులు,
చిత్తగించవలెను.

తాజా కలం: మిగతా పుస్తకాలూ త్వరలోనే చదివి మళ్ళీ బ్లాగుచెసుకోవాలని ఆశిస్తున్నాను

Friday, January 7, 2011

మీకు ఖద్దరు తెలుసా ?

ఖద్దరు కి పట్టు కి తేడా ఏంటి? ఖాదీ ముసలి వాళ్ళకు లేక రాజకీయ నాయకులకు మాత్రమేనా? ----- ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ శని ఆది వారాల్లో (8th n 9th jan ) మలేషియన్ టౌన్షిప్లో జరగనున్న ఖాది అవగాహన మరియు అమ్మకం కార్యక్రమానికి ఉపోద్ఘాతం.

ఆనంద్, గోదావరి, హేప్పీ డేస్ మరియు లీడర్ సినిమాల ల ద్వారా ఖద్దరును వాడకాని సామాన్య ప్రజలకు మరోసారి గుర్తు చేయాలనే ప్రయత్నం చేస్తున్న fashion designer అరవింద్ జాషువా Wearable apparel line ప్రదర్శన మరియు అమ్మకం ఈ శని ఆది వారాల్లో (8th n 9th jan ) మలేషియన్ టౌన్షిప్లో జరగనుంది. ఈ కార్య క్రమానికి దగ్గర్లొ ఉన్నవాళ్ళూ వెళ్ళి ప్రొత్సహిస్తారని ఆశిశ్తున్నాను. మీరు వెళ్ళడం కుదరక పోతే దగ్గరలో ఉన్న మీ స్నేహితులకు తెలియజేయవచ్చు.