Thursday, October 29, 2009

అమెరికా భోజనంబు.... వింతైన వంటకంబు


మా టీం లో అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఒక కామన్ ఎఫెక్టు ఉండేది. అది, బరువు తగ్గడం. మరి దేశం కాని దేశం లో, అసలే వంట సరిగ్గా రాకుండా, రోజూ బయట తినే అవకాశం లేక వాళ్ళంతా బక్కచిక్కిపోయి వెనక్కి వచ్చేవాళ్ళు. నేను మమూలుగానే BMI కి మైనస్ లో ఉంటాను, దాంతోటి అందరూ భయపెట్టడం మొదలుపెట్టారు వచ్చేసరికి నువ్వు మాయం ఐపోతావు, స్కెలిటన్ లా తయారౌతావు అని. నాకు మనసులో కొంచెం బెరుకు గానే ఉన్నా, సీనియర్స్ ఉన్నారులే అనే ధైర్యం తో ఫ్లైట్ ఎక్కేసాను. ప్రయాణంలో తిన్న తిండి గురించి ఎంత తక్కువ చెప్తె అంత మంచిది. మా పోర్ట్ ఒఫ్ ఎంట్రీ LA ఏర్పొర్ట్లో ఏమైనా తినాలని మా వాళ్ళంతా అన్నారు(మరి ఆఫీస్ డబ్బులిస్తుంది కదా). సరే, అక్కడో రెస్టారెంట్ ఉంటె వెళ్ళాం. నాకు సడెన్ గా కడుపులో తిప్పడం మొదలయింది. బాబోయ్ ఏంటీ కంపు?? అడిగాను. హ్మ్మ్ అమెరికాలో ఇంతే అలవాటయ్యే వరకు ఇలాగే ఉంటాది తర్వాత్తర్వాత నువ్వే సెట్ అయిపోతావులే అని చెపారు. అందరూ బర్గర్లు అవీ తింటుంటె, నేను మాత్రం వీలైనంత దూరంలో కూర్చుని ఐస్ క్రీం తిని సరిపెట్టాను.


సియాటిల్ చేరేసరికి అర్ధరాత్రయ్యింది. తిన్నగా తెలిసిన వాళ్ళింటికెళ్ళాము. తీరా అక్కడికెళ్ళేసరికి తెలిసింది వాళ్ళంతా లాంగ్ వీకెండుకి ఏదొ ట్రిప్ కెళ్ళారంట. ఫోన్ చేస్తే మీరు వొండుకొని తినేయండి మేం వచ్చెసరికి టైం పడుతుంది అని చెప్పారు. అందరం పిచ్చపిచ్చగా అలసిపోయి ఉన్నాం పోనీ రేపు ఉదయాన్నే తినొచ్చులే...నేను అస్సలు ఒప్పుకోను! మీరంతా ఏదొ గడ్డి ఐనా తిన్నారు, నేను మాడిపోతున్నాను అని తీవ్రంగా వ్యతిరేకించేసరికి సరేలే అని బియ్యం మాత్రం కుక్కర్లో పోసి, మాతో వచ్చిన అబ్బాయిని అడిగాం పచ్చళ్ళు ఏమైనా తెచ్చావా అని. తెచ్చావా ఏంటి? ఒక చెకిన్ బేగ్ మొత్తం పచ్చళ్ళే అని చూపించాడు. ఏంటిది? ఇక్కడ గాని పచ్చళ్ళ కొట్టు పెడదామనుకుంటున్నవా అంటె, హి హి కాదు, ఇక్కడున్న మనవాళ్ళ ఆర్డర్ ఇది అని చెప్పాడు(అక్షరాలా 20 కేజీల అచ్చ తెలుగు పచ్చళ్ళు). కుక్కర్ అవ్వగానే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తిన్నాక గాని శాంతించలేదు నా ఆత్మా సీత.


రెండ్రోజుల్లో ఇల్లు, ఆఫీస్ అన్ని సెట్లయ్యాయి. ఇండీయా నుంచి లిస్ట్ ప్రకారం తెచ్చుకున్న ఉప్పులూ పప్పులూ అన్నీ సర్దుకున్నాం. రోజుకిద్దరు చొప్పున వంట కి వంతులు వేసుకున్నాము. నేను హిమ ఒక టీం. మా వంతు రోజున ఆఫీస్ నుంచి ఆత్రం గా ఇంటికి వచ్చాను. హిమ, ఏం వండుదాం? హ్మ్మ్... ఆలూ?(నా ఉద్దేశం ప్రకారం ఆలూ వండటం అన్నింటికన్నా సులువు). సరే, నేను రెడీ అయ్యి వచ్చేలోపు ఆలూ కట్ చేసి ఉంచు అని హిమ లోపలికి వెళ్ళి, ఒక పది నిముషాల్లో తిరిగి వచ్చింది. ఏవీ ఆలూ అని అడిగింది. నేను ఉత్సాహంగా చూపించాను. బాగా కడిగిన అరడజను ఆలూలు, ఇంకా ఒక తళ తళా మెరిసేలా నునుపుగా చెక్కుతీసిన ఆలూ. ఏంటి ఇప్పటివరకు నువ్వు చేసింది ఇదా?? మరి నాకు వంట రాదు కదా, నేను కొంచెం మెల్ల మెల్లగా చేస్తుంటాను అన్నీ అని చెప్పాను. పైగా నాకు తెగ చాదస్తం, కడిగిందే కడుగుతూ, తొక్కలు ఎక్కడా ఒక్క చిన్న పిసరు కూడా మిగలకుండా పీల్ చెయ్యడం, అన్ని ముక్కలూ ఒకే సైజు, షేపులో వచ్చేలా కట్ చెయ్యటం ఇలా.... ఇక అప్పటికే ఆకలితో మాడిపొతున్న మావాళ్ళంతా తీవ్రంగా అభ్యంతరం తెలియజేసాక, ఇంక నా వల్ల కాదులే అని, నన్ను బియ్యం కడగమని, తనే చేసింది ఆలూ. నేను బియ్యం కొలిచి, కడిగేలోపు ఆలూ కూర ఐపోయింది. ఇక జనాలకి అర్ధం అయింది నా వంట ప్రతాపం. నా వంతు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు వాలంటరీ గా హెల్ప్ చేసేవాళ్ళు. నేను బలవంతం గా చేస్తానన్నా చేయనిచ్చేవారు కాదు.
అసలు నన్నంతలా ఆడిపోసుకుంటారు గాని, మా వాళ్ళంతా వంటలో అంతంత మాత్రమే. హిమ, నీలు మాత్రం బాగానే గరిట తిప్పగలరు. ఇక మిగతా వాళ్ళ వంటలు రక రకాలుగా ఉండేవి. మచ్చుకి,
జాంకాయ్- చేమదుంపల ఫ్రై: ముందు చేమదుంపలని తొక్కతీసి ఉడకబెట్టాలి. జాంకాయ్, చేమదుంపలు ఉడకపెట్టాక తొక్కలు తియ్యాలి అని నాకు అనుమానంగా ఉంది. చీ నువ్వు కూడా నాకు చెప్పేస్తున్నావా?? నేను సీనియర్ని గుర్తుంచుకొ! సరే, తొక్కతీసి ఉడకపెట్టిన చేమదుంపలు కొయ్యటం మీరే ఊహించుకోండి.
ఆరతి- కందిపప్పు: ముందు పప్పు కుక్కర్లో పెట్టు...అరే, ఎన్ని విసిల్స్ వచ్చినా ఉడకట్లేదేంటీ??? కందిపప్పు బదులు సెనగపప్పు పెడితే ఇలాగే అవుతాది.
గాయ్- .....పేరు తెలీదు: క్యా బనా రహీ హొ? అరె, ఫ్రిజ్ మే జో భి హో వో సబ్. అంటె కలిపికొట్టరా కావేటి రంగా అని, అన్ని కూరగాయలూ కలిపి ఒక పేకెట్ మసాలా వేసి వండెస్తుంది అంతే. తిండం మానడం మన ఇష్టం.
జాంకాయ్+గాయ్ - కేక్: రెడీ మేడ్ మిక్స్ తెచ్చి, కేక్ బౌల్ లేనందువల్ల ఒక ప్లేట్లో వేసి బేక్ చేసారు. కేక్ బదులు వెనిల్ల కేక్ బిస్కట్లు తిన్నాం.
కాని ఏది ఏమైనా, ఎలా వచ్చినా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. వీకెండ్స్ కి పక్క రూం అమ్మాయిలు అందరం కలిసి మరీ వండుకునే వాళ్ళం. అప్పటి వరకు అమీర్పేట్ హాస్టల్ లో ఉన్న నాకైతే రొజూ పండగే.
ఇక అక్కడ ఉండే మనవాళ్ళ అతిధి సత్కారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలే మేం వెళ్ళింది పండగల సీజన్. వినాయక చవితి నెక్స్ట్ రోజు దిగామనుకుంటా. ఇక ఏదొ ఒక పండగ రావటం, మమ్మల్ని వాళ్ళు భోజనానికి పిలవడం. దీపావళి లాంటి నాకు తెలిసిన పండగలే కాకుండా, నేను ఇండియాలో ఎప్పుడూ వినని కార్తీక పౌర్ణమి లాంటి పండగలు కూడా భేషుగ్గా చేసుకునే వాళ్ళు. మళ్ళి మెనులో ఎక్కడా తగ్గడం ఉండేది కాదు. అయ్యొ, ఎలాగు ఇండియా లో లేము, కనీసం వంటకాలైనా సరిగ్గా చేసుకొకపోతే ఎలా అని, పులిహోర తో మొదలెట్టి, గారెలు, బూరెలు, పూరీలు, బొబ్బట్లు, చక్రపొంగలి, పాయసం, పరమాన్నం(బెల్లం తో) ఇంకా కనీసం నాలుగు రకాల వేపుళ్ళు, కూరలు అబ్బో..... మళ్ళీ, "హూం ఇదే ఇండియాలో ఐతేనా ఎంత బాగా చేసుకునే వాళ్ళమో " అనే స్టాండర్డ్ డైలాగ్ మాత్రం తప్పనిసరి. నేను కూడా పనిలో పనిగా " హూం ఇదే ఇండియాలో ఐతే అసలు పండగనే తెలీకుండా మా హాస్టల్ ఆంటీ చేసే ఉప్పులేని చప్పిడి ఫుడ్డొ, లేక ఏదొ హోటలో జంక్ ఫుడ్డో తినే దాన్ని" అని డైలాగ్ వేసుకునేదాన్ని. మొత్తానికి నా అమెరికా మూడు నెలల్లో నేను నేర్చుకున్నది ఏమైనా ఉంది అంటె అది వంట చెయ్యడం అని సగర్వంగా చెప్తాను. మా రూం మేట్స్ కొంతమంది శాకాహారులవడం వల్ల ఓన్లీ వెజిటేరియన్ వంటలే నేర్చుకున్నా, నాకు పెళ్ళయ్యే వరకు నేను ఆ వంట మీదే బతికాను. ఎందుకంటె, నేను ఇండియా వచ్చేసిన తర్వాత ఆ హాస్టల్ వదిలేసి ఫ్లాట్లో ఫ్రెండ్స్తో కలిసి ఉండడానికి, నా అమెరికా అనుభవం వల్ల, నాకు పర్మీషన్ ఇచ్చారు మమ్మీ.
సరే, ఇక వెళ్ళిపొయే టైం వచ్చింది, అందరం సూట్కేసులు సర్దుతున్నాం. ఒక వేయింగ్ మిషన్ తెచ్చాం (ఇలాంటివన్ని అక్కడ సెట్లైన మన వాళ్ళదగ్గర తప్పనిసరిగా ఉంటాయి). అందరం సూట్కేసులు వెయిట్ చెక్ చేస్తున్నాం, ఒక కేజీ ఎక్కువైనా పరవాలేదు కాని, ఒక్క గ్రాము కూడా తక్కువ ఉండకూడదు అనేది మా ప్రయత్నం. జాంకాయ్, నువ్వు కూడా నించో చూద్దాం సరదాగా అన్నాను. జాంకాయ్ ఎక్కింది, హెయ్ xyz ఉన్నావు... వెంటనే పక్కనే ఉన్న హిమ కేజీల్లోకి కన్వర్ట్ చేసి చెప్పింది(అక్కడన్నీ పౌండ్స్ కదా). ఏంటీ, మళ్ళీ చూడు, జాంకాయ్ మళ్ళీ ఎక్కింది, సేం నంబర్. అరె, ఇంత తేడా ఎలా? హిమా నువ్వు ఎక్కు చూద్దాం. ఇంకొ abc వచ్చింది. తనుకూడా నమ్మలేదు. వేయింగ్ మిషన్ తప్పేమొ! ఒక్కొక్కళ్ళం ఎక్కి చూసుకున్నాం. డౌట్ లేదు ఖచ్చితంగా మిషన్ తప్పు రీడింగ్ చూపిస్తుంది. లేకపొతె అందరి వెయిట్ ఎందుకు తేడా వస్తుంది? సరె, ఇప్పుడు అవన్నీ పట్టించుకోటానికి టైం లేదు. ఆఖరు నిముషం హడావిడిలో అంత పట్టించుకోక పోయినా అందరి మన్సుల్లోను తొలుస్తూనే ఉన్నాయి ఆ నంబర్లు.
ఆఫీస్ కి రాగానే టీం మేట్స్ అంతా వచ్చారు, కుశలపశ్నలు ఐనతర్వాత అందరూ కలిసికట్టుగా అన్నరు...హి హి అమెరికా నీకు బాగా పడినట్టుంది (మనసులో- దుర్మార్గుల్లరా దిష్టి కొడతారా! చీ)
ఇంటికి వచ్చెసరికి మమ్మీ, డాడీ : చిన్నితల్లీ, ఇప్పుడు కొంచెం బాగున్నావమ్మా! (అదేంటి మనం ఎలా ఉన్నా ఇంట్లొ వాళ్ళకి చిక్కిపోయినట్లుగా కనిపించాలికదా?)
మా పెంటమ్మ: సిన్నీతల్లి సిన్న వొల్లు సేసింది కందండి అమ్మగోరు.... (పెంటమ్మా, నీకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేనట్టుంది, డాక్టర్ దగ్గరకి వెళ్ళు)
మా బాబీ గాడు: ఏంటక్కా ఇలా సిలిండర్ లా అయ్యావ్?? (పోరా వెధవా)
పక్కింటి మణాంటీ: చిన్నీ! ఏంటి పెళ్ళి కళ వచ్చేసింది అమెరికా వెళ్ళొచ్చేసరికి, బుగ్గలొచ్చాయ్, రంగు తేలావ్? ఏంటి కధ??? (ఆంటీ నాకు పనుంది మళ్ళీ వస్తానేం)
మా కసిన్ గురుద్వారా కి వచ్చింది నన్ను పిక్ అప్ చేసుకోడానికి. నన్ను అంతదూరం నుంచి చూడగానే.......... ఒస్సే పందీ !!!!.....హ హ హా!!!.....( చాలు ఇంక ఆపు. నీ పోయింట్ నాకు అర్ధం అయింది. మనం ఇంక వేరే విషయాలు మాట్లాడు కుందాం! )

***** మీకు కూడా అర్ధం అయిందనుకుంటా పోయింట్. మనం కూడా వేరే విషయాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ టైం.

Wednesday, October 21, 2009

చీకటి వెలుగుల తెల్ల పులి !

మొన్న దీపావళి కి ముందురోజు సాయంకాలం, అప్పుడప్పుడే చీకటి పడుతూంది. నేను కిచెన్ లో వంట మొదలు పెట్టాను. ఆరోజు మాతొ గడపడానికి ఇంటికి వచ్చిన ఫ్రెండు బాల్కనీలో నుంచుని వెనక వీధి లో పిల్లలు టపాకాయలు కాలుస్తుంటే చూస్తూ, నాకు కావాలీ అని గోల చేస్తుంది. సరే సంగతేంటో చూద్దాం అని నేను కూడా వెళ్ళాను. మేము రెండో ఫ్లోర్లో ఉండటం వల్ల, మా ఇల్లు వీధి చివర అవటం వల్ల, ఇంకా, మా ఇంటి ప్రక్క అంతా ఖాళీ జాగా ఉండటం వల్ల, మాకు చాలా మంచి వ్యు కనిపిస్తూ ఉంటుంది బాల్కనీ నుంచి. మా ఇంటి వెనక వీధి లో ఆఖరు ఇల్లు, పెద్ద బంగళా లాగ ఉంటుంది. వాళ్ళ పిల్లలు, ఒక పాప ఏడెనిమిదేళ్ళు ఉంటాయేమొ, ఇంకో చిన్న పాప సంవత్సరం పిల్ల. పెద్దమ్మాయి కాకరపువ్వొత్తులూ, చిచ్చిబుడ్డీలు, భూచక్రాలు కాలుస్తుంటె, చిన్నపాప అక్క వెనకాలే తిరుగుతూ ఉంది. బాగా చూడ్డానికని బాల్కనీ చివరకు వెళ్ళాం. మా ఫ్రెండు సడ్డెన్ గా నా చేయి పట్టుకుని రూత్, అటు చూడు అంది. మా ఇంటి పక్క ఖాళీ స్థలం లో ఉన్న గుడిసెల వాళ్ళ పిల్లలు, రోడ్డు వారగా నుంచుని చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కాని చాలా మంది ఏడిచినా లాభం లేదు అన్న విషయం అర్ధం అయినట్టుగా నుంచుని ఉన్నారు. ఇద్దరం ఒక నిముషం మౌనం గా ఉండిపోయాం. రోడ్డు కి ఒకవైపు బంగళా, నవ్వులు, వెలుగు...... రోడ్డు కి మరోవైపు గుడిసెలు, కన్నీళ్ళు, చీకటి.

సరిగ్గా ఆ సమయం లో ఆ పిల్లల మనస్సుల్లో ఏమవుతుందో నేను గ్రహించగలను కాని ఆ చిన్న మెదడుల్లో ఏమవుతుందో ఎవరికి తెలుసు? కాని ఇదే విషయాన్ని ఎంతో నేర్పుతో, ఓర్పుతో చెప్పిన పుస్తకం- ఈ మధ్య వచ్చిన " ద వైట్ టైగర్"(The White Tiger). అసలు నాకు సమకాలీన భారతీయ ఆంగ్ల సాహిత్యం (contemporary indian english litarature) మీద అంత సదభిప్రాయం లేదు. అందులోనూ అవార్డ్లొచ్చిన వాటి మీద అస్సలు లేదు. గతంలో చదివిన రెండు పుస్తకాలూ, అరుంధతీ రాయ్ - "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" (god of small things) మరియు కిరన్ దేసాయ్ -" ద ఇన్ హెరిటన్స్ ఆఫ్ లాస్"(the inheritance of loss ), నన్ను బాగా నిరాశపరిచాయి. కాని అరవింద్ ఆదిగ రాసిన " ద వైట్ టైగర్" మాత్రం తప్పకుండా చదవదగ్గ పుస్తకం. IT బూం చూసి, పెరుగుతున్న SEZలు చూసి, సెన్సెక్స్ పట్టికలు చూసి, గొప్పగొప్ప వాళ్ళు వాళ్ళ భార్యలకి గాల్ ఫ్రెండ్స్ కి ఇస్తున్న బహుమతులు చూసి, ఇంకా బాలివుడ్ సినీమాల బడ్జెట్లు చూసి, ఆహా భారత్ వెలిగిపోతోంది అని అనుకునే వాళ్ళకు ఈ పుస్తకం ఒక కనువిప్పు.అర్ధరాత్రుళ్ళు సైతం మిల మిలా వెలుగులు విరజిమ్ముత్తూ పట్టపగలును తలపించే ఆఫీసులతోపాటు, మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం కూడా చిమ్మచీకటిలో ఉండే గ్రామాలున్నాయని గుర్తుచేస్తుందీ పుస్తకం. అంతే కాదు, ఇలాంటి గ్రామాలని అశ్రద్ధ చేస్తే వచ్చే పరిణామాలను కూడా తన శైలిలో చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది.

బల్రాం హల్వాయి, బీహార్లోని ఒక కుగ్రామంలో పుట్టిన తెలివైన అబ్బాయి. తండ్రి ఒక రిక్షా పుల్లర్, తల్లి చనిపోయింది. అబ్బాయిని స్కూల్కి పంపించినా, తండ్రి హటాన్మరణంతో చదువు మానిపించి, ఊర్లోని టీకొట్లో ఉద్యోగానికి పెడుతుంది నానమ్మ. టీకొట్లో పనిచేసేటప్పుడే జీవితంలో పైకిరావాలంటే ఏంచెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు బల్రాం. తరువాత పక్క ఊరిలోని హోటల్ లో పని చేయటానికి వెళ్తాడు కుటుంబంలోని ఇతర అబ్బాయిలతోపాటు. అక్కడ గమనిస్తాడు, చీకటిలోనుంచి వెలుగులోనికి రావటానికి ఒక తెలివైన దారి డ్రైవర్ పని అని. అన్నని, నానమ్మని ఒప్పించి డ్రైవింగ్ నేర్చుకుంటాడు. అదే ఊళ్ళో ఉంటున్న తన గ్రామ పెద్ద ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన గ్రామపెద్ద చిన్న కొడుకు కోడలితో కలిసి ఢిల్లి వెళతాడు. కాని ఢిల్లీ వెళ్ళగానే సంబరపడటానికిలేదనీ, ఢిల్లీ వెలుగులోనే ఉన్నా, అక్కడకూడా చీకటికోణాలు ఉన్నాయని, తనలాంటి డ్రైవర్లందరూ ఇలాంటి చీకటికోణాల్లోనే ఉంటారని తెలుస్తుంది. ఐతే, తనుకూడా అసలు సిసలు వెలుగులోనికి రావటానికి ఏం చేసాడో, అందుకు ఏమేమి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడో, వాటిగురించి తన అభిప్రాయాలేంటో తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే మరి.

ఈ పుస్తకం గురించి నాకు నచ్చిన ఇంకొన్ని విషయాలు: పుస్తకం మొత్తం ఎక్కడా బిగి సడలకుండా మంచి పేస్ తో నడుస్తుంది. అస్సలు విసుగనిపించదు. వెలుగు, చీకటి అన్న (Light and Darkness) మెటాఫోర్ ఉపయోగించిన విధం చాలా హత్తుకునేలా ఉంది. నేను పుస్తకం చదివేటప్పుడు రచయిత ఏం చెప్తున్నాడు అనేదాన్ని గ్రహించినా, దాని ప్రతిసారీ ఆమోదించను. కాని, ఈ పుస్తకంలో రచయితే చాలా తటస్థంగా (neutral) ఉన్నాడు. బల్రాం చేసిన పని మచిదా కాదా, తనని ఎలా అర్ధం చేసుకోవాలి, అనేది పాఠకుడి కే వదిలేసాడు అనిపించింది. ఇక్కడ బల్రాం ఒక హీరో కాదు, విలన్ కూడా కాదు. ఒక మనిషి అంతే. ఈ మనిషిని హీరో ని చేసినా, విలన్ ని చేసినా అది పాఠకుడి ఇష్టం.

Thursday, October 15, 2009

అమెరికా చిత్రాలు

ఇప్పుడు మనం ఆ కప్పని తిందాం ! ఏంటీ, మొదటి టపా కి వచ్చిన కల్లెక్షన్లు- వ్యాఖ్యలు చూసి నాకు కొంచెం... అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది ఒక పుస్తకం(Eat That Frog) పేరు. ఈ మధ్యనే ఎవరో బ్లాగ్ లో దాన్ని పరిచయం కూడా చేసారు. ఈ పుస్తకపాఠం ఏంటంటే , ఎప్పుడూ మనకు అతి కష్టమైన పనిని మొదటగా చేసేయ్యాలి. నాకు అమెరికా అనుభవాల్లొ అతి ముఖ్యమైన మరియూ, జనాలకి అతి కష్టమైన విషయాన్ని మొట్టమొదటగా చెప్పేసుకుందాం అని నా కవిహృదయం.



మాది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వటం వల్లనూ, అంతకుముందే చాలా మంది అక్కడికి మాలాగే మూడు నెల్ల ఆన్ సైట్ వెళ్ళివచ్చి వుండడం వల్లనూ, అక్కడికి ఎవరు వెళ్ళినా ఏం చేయాలి అన్న ఒక మాదిరి(template) మేమెళ్ళేసరికే రెడీగా ఉంది. ఓహ్! అసలు సంగతి చెప్పలేదు కదా, మేమెళ్ళింది సియాటిల్,WA కి. మొదట వాషింగ్టన్ DC ఏమో అనుకుని తెగ ఆవేశపడిపొయాను. కాని, ఎక్కడో అక్కడికి, అమెరికా అంటూ వెళ్ళ్తున్నాం కదా! సరె, వెళ్ళగానే మా సీనియర్స్(అంటె, రెండోసారి వచ్చినవాళ్ళు) చెప్పారు- మొదటి వీకెండు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతె, బస్ రూట్ లూ అవీ తెలుసుకోవాలి. రెండో వీకెండ్ నుంచి సియాటిల్ సిటీ టూర్ అని ఉంటాది, అది ఫినిష్ చెయ్యాలి. ఇది ఐదు ప్లేసెస్ కి కలిపి ఒక పేకేజ్ టూర్ అన్నమాట. అసలు అన్నింటికన్నా ముందు మనకి ఒక కెమేరా ఉండాలి. ఎందుకు??? ఎందుకేంటి?(టపా పేరు చూడలేదా?) అసలు అమెరికా వచ్చినవాడెవడైనా ఇక్కడ చిత్రాలు/బొమ్మలు/అచ్చతెలుగులో-ఫొటోలు తీసుకోకుండా ఉంటాడా? కెమేరా లేకుండా కాలు బయటకి పెడతాడా? ఫొటోలు లేకపొతె నువ్వుస్సలు అమెరికా వెళ్ళొచ్చినట్టు గేరంటీ ఏంటి? .......... అని బాగా గడ్డి పెట్టాక, డౌట్ డౌట్ గానే నా దగ్గర ఉన్న కెమేరా తీసాను. ఇది ఓకెనా? హ్మ్మ్, ఇది చాలా ఓల్డ్ మోడల్(ఆర్నెల్ల క్రితం మా టీమ్మేట్ తొ తెప్పించాను) 512mb అంటె 250 ఫొటోలు మాత్రమే పడతాయి, వేరే కెమేరా కూడా చూడండి. ముగ్గురికి కనీసం రెండు కెమేరాలైనా ఉంటె మంచిది.



సరే, ఆ సీనియర్ దగ్గరే, ఇంకో కెమేరా అప్పు తీసుకుని, రెండూ ఫుల్ల్ చార్జింగ్ పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాం. మా ఫ్లాట్ నుంచి ముగ్గురు, పక్క ఫ్లాట్ నుంచి ఇద్దరు (వీళ్ళకి వేరే కెమేరా ఉంది). సీనియర్స్ మాతో రారు వాళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ చూసేసారు. అందరం ట్రింగా రెడీ అయ్యి, బాక్పాక్ లో గొడుగు, పులియొగరె డబ్బా, డైట్ కోక్ టిన్ను, MP3/ఐపోడ్ etc.. తొ బస్ స్టాప్ కి వచ్చాం. రాగానె, రోజూచూసె బస్ స్టాప్ చాలా కొత్తగా కనపడింది. వెంఠనే అందరం, విలన్ని చూడగానె డిటెక్టివ్ గన్ తీసినట్టు, వాళ్ళ వాళ్ళ కెమేరాలు పౌచ్ లోంచి బయటకి తీసాం. క్లిక్ క్లిక్ క్లిక్ క్లిక్ క్లిక్... ఐదుగురు అమ్మాయిలు ఐదు ఫొటోలు విత్ అమెరికన్ బస్ స్టాప్. అంతే, అక్కడనుంచి, ప్రతి చెట్టుతొ, పుట్టతొ, ఆక్వేరియంలో చేపలతొ, అల్ల్చిప్పలతొ, క్రూజ్ లో షిప్ తొ, షిప్ నడిపే కేప్టెన్ తొ, షిప్ తుడిచె స్టీవార్డ్ తొ, సియాటిల్ స్పేస్ నీడిల్ తొ, పసిఫిక్ సైన్స్ సెంటర్లో సబ్బు బుడగలతొ, నీటి ధారలతొ, రోడ్డు మీద పూలతొట్టెలతొ, చెత్తబుట్టలతొ, కాదేదీ ఫొటోకనర్హం అని శ్రీ శ్రీ గారిని గుర్తు చేసుకుంటూ..... పైగా అన్ని ఫొటోలూ ఐదు సార్లు. అంటే, ఇప్పుడు రోడ్ మీద ఒక పూలతొట్టి ఉంది అనుకోండి, వెంటనే దాని పక్కన నెను, క్లిక్ తర్వాత అదే ప్లేస్లో ఆరతి, క్లిక్ తర్వాత షై, క్లిక్ etc.... అలా అన్నమాట. ఒక్కోసారి అమెరికన్స్ కొంతమంది మా గ్రూప్కి కలిపి ఫొటో తీస్తాం అని హెల్ప్ చేసేవారు, ఒక్కోసారి నవ్వుకునేవాళ్ళు లేదా మమ్మల్ని వింతగా చూసేవాళ్ళు, ఐనా మేమెక్కడా తగ్గలేదు. బోడి, వాళ్ళకు మేం వింతైతే వాళ్ళబట్టలూ, జుట్లూ, కంపూ మాకూ వింతే మరి హూం!



ఇక తర్వాత వీకెండ్ జూ, ఫ్లైట్ మ్యుజియం. ఇవి ఐపోతె, సిటి టూర్ ఐపోయినట్లె. ముందు జూ కి బయలుదేరాం. యధావిధిగా, అన్ని కేజులతొ, పాములతొ, తొండలతొ, పిట్టలతొ ఫొటోలు తీసుకుంటూ వెళ్తున్నాము. ఒక దగ్గర మంకీస్ ఉన్నాయి. చాలా హుషారుగా ఇకిలిస్తూ ఫీట్లు చేస్తున్నాయి. అందరం ఫొటోలు దిగాము. నెక్ష్ట్ ఏదొ పిట్టలు మళ్ళీ.. కాని సరిగ్గా కనిపించట్లేదు. ఆకుల్లొంచి నల్లటి బలమైన బీక్ మాత్రం కనిపిస్తుంది. ఏదో ఒకటిలే, అస్సలే ఐదుగురం ఫొటోలు తీసుకోవాలి అని అందరం దిగేసాం. బర్డ్ కేజ్ అవతలవైపు దాని నేం బోర్డ్ ఉంది అని చూడ్డానికి వెళ్ళాం..... అందరం ఫ్రీజ్ ఐపోయాము కొంతసేపు. అక్కడ వంకరగా వేలాడుతున్న బోర్డ్ మీద బోల్డ్ అక్షరాల్లో ఉంది- INDIAN CROW !!! ఒక్క క్షణంలో తేరుకుని అందరూ చక చకా కెమేరాలో ఇందాక తీసిన ఫొటోలు డిలీట్ చేసేసాం. ఇంత బతుకూ బతికి, అమెరికాకొచ్చి...హూం! అందరూ ముందుకి నడిచారు, నాకు ఎందుకో చిన్న అనుమానం మొదలైంది. మీరు వెళ్తుండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇందాక చూసిన మంకీ దగ్గరకు వెళ్ళాను. అది మళ్ళీ ఆనందంగా గంతులు వెయ్యటం మొదలెట్టింది, నా అనుమానం పెరుగుతూ పోయింది...అటు వైపు వెళ్ళి బోర్డ్ చూసాను............... !!!


ఇలా, సియాటిల్ లో తిరిగిన ప్రతీ చోటా రెండొందలకి తక్కువకాకుండా ఫొటోలు తీసుకున్నాం. సీనియర్లు శెభాష్! అన్నారు. సిటీ టూర్ తరువాత, రూం లో అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ సెట్టిల్ ఐపొయిన మనవాళ్ళు ఇక్కడికీ అక్కడికీ కారుల్లొ తిప్పేవారు. కాని, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా వెంట కెమేరా లేకుండా మాత్రం కదిలే వాళ్ళం కాదు. మళ్ళి, ఇండియా కి బయల్దేరే సరికి నా ఫొటోలు కేవలం 4 GB అయ్యాయి(అసలు నా కౌంట్ చాలా ఏవరేజ్ మిగతావాల్లతొ పోలిస్తే). సరే, ఇంటికి వచ్చాక, అమ్మా నా అమెరికా ఫొటోలు చూపిస్తాను అని కూర్చొపెట్టాను.



1..2..3..అబ్బ భలే ఉన్నాయి



10...20...25 ఊ.. ఆన్నిట్లోనీ నువ్వే కదా (లేకపొతె, పక్క వాళ్ళవి చూపిస్తానా ఏంటి)



పోని, ఇవి చూడమ్మా, ఇందులో నేను లేను, అన్ని సీనరీస్ ఉన్నాయి. మంచు, ఫాల్ కలర్స్, కొండలు... అసలు నువ్వేలేకుండా ఫొటో ఎందుకే?



ఇలాక్కాదు గాని, డాడీ ని కేచ్ పడదాం.... డాడీ మన కుటుంబంలో ఒకరు, అందులోనూ ఒక అమ్మాయి మొదటిసారి అమెరికా వెళ్ళింది కదా, ఔను. మరి ఆ సంతోషం మీరు పంచుకోవాలికదా, ఔను. కాబట్టి నా ఫొటోలు చూడండి. అబ్బా, నాకీ కంప్యుటలో అసలు అర్ధం కావమ్మా, ఒక మంచి ఫొటోలు నాలుగు, నువ్వు ఫెయిర్ గా ఉన్నవి కడిగించి ఇవ్వు, పనికొస్తాయి.(గ్ర్ర్... ! నాకు తెలీదా ఎందుకో)



హ్మ్మ్... ఈ పెద్దవాళ్ళకి అతితెలివి ఎక్కువైపోతుంది. ఈసారి పిల్లల్ని(మా అక్క కూతుర్లు) ట్రై చేద్దాం...



బ్లెస్సితల్లీ, నిస్సిబంగారం, ఇలా రండమ్మా... నేను అమెరికా నుంచి మీకు బట్టలూ, బొమ్మలూ, చాక్లెట్లూ తెచ్చానుకదా, మరి మీరు అమెరికా ఎలా ఉంటుందో చూడరా?



నువ్వు ఏ ఊరు వెళ్ళావ్?... అమెరికా.



డాడీ ఏ ఊరు వెళ్ళారు?... లండన్ (మా బావగారు అప్పుడు UK లో ఉన్నారు).



అంటే అది డాడీ వాళ్ళ ఊరు కాదా? ...కాదు... ఐతే, మాకొద్దు ఫొ!



*



*



*



*



*



ఒకటిన్నర సంవత్సరాల తరువాత....



అప్పారావ్... ఎంటి చిన్ని,



మీకొ స్వీట్ సర్ప్రైజ్ !... హ్మ్మ్ ఏంటది?



ఒక బ్లాక్ CD కేస్... హనీమూన్ ఫొటోలా?



కాదు, నా అమెరికా ట్రిప్ ఫొటోలు... అల్బం చేయించాలా?



ఖాదు, జుస్ఠ్ ఛూస్తే ఛాలు !!! .... ఇంత లైవ్లీ గా నువ్వే నా ముందు ఉండగా ప్రాణంలేని ఫొటోలు ఎందుకు చెప్పు?


నాకు తెలీదనుకున్నరా? మీ నాటకాలు? బాబీగాడు మీకు ముందే చెప్పేసాడుకదా ఈ ఫొటోల గురించి? ఎట్టిపరిస్థితుల్లోను వాటిగురించి కమ్మిట్ అవ్వొద్దని? అస్సలు నేను ఎవ్వరికీ చూపించను నా ఫొటోలు. మీరు అడిగినా సరే. హూం!!!



.........ఏమనుకుంటున్నారో నిజంగానే మీరు ఎవరు అడిగినా సరే చూపించనంతె !



Tuesday, October 13, 2009

అమెరికా అదుర్ష్టం

మాది అనకాపల్లి. అవును, అక్షరాలా (తెలుగు సినిమాల్లొ జొక్లు వేసే)అనకాపల్లే! నేను పుట్టి పెరిగింది, చదువుకున్నదీ అంతా అక్కడే. నేను ఉద్యొగ వేటలొ ఈ హైదరాబాద్ మహానగరానికి వచ్చేవరకు నా లైఫ్ అంతా అక్కడే గడిచింది. మాకు వైజాగ్ చాలా దగ్గర. పైగా, మామయ్యలు, అత్త ఇంకా చాలా బీరకాయ పీచు చుట్టాలు వైజాగ్ లో ఉండటం వల్ల మేము అక్కడికి చాలా తరచుగా వెళ్తూ ఉందే వాళ్ళం. మా కసిన్స్, మేము చాలా క్లొస్ గా ఉండే వాళ్ళం. సరె, నేను అక్కడకి వెళ్ళినప్పుడల్లా, వాళ్ళతొ బయటకి, వెళ్ళటం వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవటం జరిగేది. మరి వాళ్ళంతా పట్నం వాళ్ళు నేనెమొ అనకాపల్లైట్ని వాళ్ళకి నన్ను ఏమని పరిచయం చెయ్యాలి? అస్సలే చూడ్డానికి మేమంతా టిప్ టాప్ గా తయారై వెల్లె వాళ్ళం. "హె షి ఈస్ మై కసిన్ ఫ్రం U.S.A." అని ఇంట్రొడ్యుస్ చెసెవాళ్ళు. ఆ ఫ్రెండ్ మరీ క్లొస్ ఐతె, తర్వాత సరదాగా, U.S.A. అంటె, united states of అనకాపల్లి హి హి ... అని ఎక్ష్ప్లనేషన్ ఇచ్చేవారు లేకపొతె అంతె, I am from U.S.A.



కట్ చేస్తె.....................నేను హైదరాబద్ లో ఉద్యొగం లో జాఇన్ అవ్వటం, సక్స్సెస్స్ఫుల్ల్ గా టాగ్ తగిలించుకొని తిరగటం అన్నీ చక చకా జరిగిపొయి రెండేళ్ళు అయిపొయాయి. ఇక ఎప్పుడూ ఎవరో ఒకరు నువ్వెప్పుడు వెళ్తావు అమెరికాకి? ఏంటి రెండేళ్ళైనా ఒక్కసారి కూడా అమెరికా వెళ్ళలేదా?? మాకు తెలిసిన ఒక సో అండ్ సో వాళ్ళ అబ్బాయి జాబ్ వచ్చిన ఆరునెల్లకే అమెరికా వెళ్ళాడంట, మా పక్క వీధిలోని ఎక్ష్ వై జీ వాళ్ళ అమ్మాయి ఇలా జాయిన్ అయ్యింది అలా విమానం ఎక్కేసింది ఇంకా ....... అంటూ నన్ను సాధించడం మొదలుపెట్టారు. అస్సలే, టీం లో అందరూ అబ్బాయిలే నేనొక్కద్దాన్నె అమ్మాయి అయ్యి వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైపొకుండా నేను ఇదై పొతుంటే, నాకు ఈ అమెరికా తంటా ఏంటొ అని నా ఏడుపు నాది. మొత్తానికి ఏదొ ఒక విధంగా (అంటె, టీం లో అబ్బాయిలు అందరూ ఒకసారి, కొంతమంది రెండు సార్లు కూడా, వెళ్ళి వచ్చాక) నా చాన్సు వచ్చింది. చెన్నై వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వచ్చాను. ఇంక టిక్కెట్ రావడమే.


మా ప్రాజెక్ట్ లో అదే రోజు అదే ప్లేస్ కి వెళ్ళ్తున్న మిగతా వాళ్ళకి, నాకు కలిపి సేం రూట్ లో టిక్కెట్స్ వచ్చాయి. హమ్మయ్య, వాళ్ళలో ముందుగా ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు అనుకున్నా. మమ్మీ డాడీ, తమ్ముడు వచ్చారు టా టా చెప్పడానికి. తెల్లవారి రెండు గంటలకి ఫ్లైట్ ఐతె, మేము పది గంటలకే ఏర్పోర్టులో ఉన్నాం మిగతావాళ్ళ కోసం ఎదురుచూస్తూ. వాళ్ళు ధీమాగా పదకొండున్నరకి దిగారు. అప్పటికి మమ్మీ వాళ్ళకి విసుగు వచ్చింది. తమ్ముడు విసిటర్స్ లాంజ్ టిక్కెట్స్ తెస్తానని చెప్పి ఇప్పటికి పత్తాలేడు. సరే, ఆడపిల్ల ఒక్కటె వెళ్తుంది కదాని అందరూ నాకొసం సహిస్తున్నట్టున్నారు. మిగతా వాళ్ళు రాగానే, ఇంక వాళ్ళు వచ్చేసారు కదా, మేమెందుకులే, ఎలాగూ మీరు ప్లేన్ ఎక్కడం కనపడదంట కదా, చాలా టైమైంది, ఇలా నసగటం మొదలు. అమ్మా, మీ కూతురు మొదటి సారి అమెరికా వెళ్ళ్తుంటె ఇంత కూడ చెయ్యలేరా అస్సలే నేను ఫ్లైట్ ఎక్కటం ఇదే మొదటిసారి అని సెంటిమెంటల్గా ఒక్క డవిలాగ్ వదిలాను. అంతె, అందరూ డిసైడ్ అయ్యరు, ఇది మనల్ని వదలదు, ఈవాళకి నిద్ర మీద ఆశ వదిలేసుకొవాలి అని. ఇంక అందరూ లోపలికి వెళ్తున్నారు, మా టీం మేట్ వాళ్ళ నాన్న గారు ఏడుస్తున్నరు, ఆ అమ్మయి కూడా కళ్ళు తుడుచుకుంటుంది. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఏడవాలా? (అసలె, ఆ అమ్మాయి ఇది రెండోసారి వెళ్ళటం). మా వాళ్ళ వైపు చూసాను, అందరూ క్లోస్ అప్ ఏడ్ లో లాగ నవ్వుతూ చెయ్యి వూపుతున్నారు. మమ్మీ చెప్పారు "చిన్నీ, ధైర్యం గా వెళ్ళి, ధైర్యం గా రా". శుభం! నేను అమెరికా కి కాకుండా, ఆఫ్రికాకి, అండమాన్ కి లేదా ఆర్కిటిక్ కి వెళ్తున్నా సరే, మా మమ్మీ ఇదే విధం గా నాకు వీడ్కోలు ఇస్తారు.


మూడు నెల్లు గిర్రున తిరిగాయి. అమెరికా లో పనులన్నీ (అంటె, మేమెళ్ళిన ఊర్లో విశేషాలన్ని చూడటం, ఫొటోలు తీసుకోడం, షాపింగ్, అప్పుడప్పుడు కొంచెం ఆఫీస్ పని) అయ్యాక, నేను ఇండియా వచ్చేసాను. నేను అనుకున్నట్లె, నన్ను రిసీవ్ చేసుటానికి ఏవరూ రాలేదు. నా కొలీగ్, ఏర్పొర్ట్ పక్కనే హాస్టల్ లో ఉన్న ఒక కసిన్ వచ్చారు. రెండు రోజుల తర్వాత ఆఫీస్ కి ఒక వారం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. అందరూ నేను తెచ్చిన గిఫ్ట్ లు చూసుకున్నారు. చాకొలెట్లు తిన్నారు. పక్క వాళ్ళకి పంచారు మా అమ్మాయి అమెరికా నుంచి తెచ్చింది అని. రెండు రోజులు తర్వాత అమ్మ, వైజాగ్ వెళ్తాను వాళ్ళకొసం తెచ్చినవి ఇవ్వాలి కదా అన్నను. ఓకె, అక్కడ మా కసిన్స్ కి తెచ్చిన గిఫ్ట్లు కూడా ఇచ్చేసాను.


ఏమె, అమెరికా లో పబ్ కి వెళ్ళవా? ఊహూ లేదు.


ఎవరైనా అబ్బాయిలు(అంటె, అమెరికా వాళ్ళు) ఫ్రెండ్స్ అయ్యరా? ఊహూ అస్సలు ఎవరితోనూ మాట్లాడనే లేదు.


అక్కడ మిని స్కర్టులు వేసుకున్నావా? ఊహూ...


అసలు ఏం చేసావ్ అక్కడ? ... నేను.. నేను ఆఫీస్ కి వెళ్ళాను, షాపింగ్ మాల్స్ కి వెళ్ళాను, ఇంక స్నోలో ఆడాను, జూ కి వెళ్ళాను, వంట నేర్చుకున్నాను, ఆ.... బొల్డు ఫొటోలు తీసుకున్నాను (4 GB) చూపిస్తాను ఉండు.......


అమ్మో!!!


మా వాళ్ళంతా మాయం.ఇంటికి వచ్చాను.


మమ్మీ, నేను అమెరికా లొ ఉన్నప్పుడు...మ్మ్, వంట చేసాక చెప్దువు గానిలే.


డాడీ ఈ ఫొటోలు చూడండి ఎంత బాగుంది కదా స్నో...ఆ, ఏముంది అంతా TVలో చూసేదే కదా, నాకు బయట పని వుంది మళ్ళీ చూస్తానులే.


ఆక్కా, పిల్లల బట్టలు బాగున్నై కదా... మన పాంటలూన్స్ లొనే దొరొకుతున్నాయి ఇలాంటివన్నీ.


ఒరే..... అబ్బా, ఏంటి నీ అమెరికా గోల, అప్పటికి ఏదొ నువ్వే అమెరికా వెళ్ళినట్టు ఎన్ని ఫొటోలని చూస్తాం?


హ్మ్మ్ ఇంక అందరూ ఇలా direct gaa చెప్పేసరికి నా అమెరికా అనుభవాలన్నీ నాలోనే అణచిపెట్టేసాను. కాని, ఈ మూడు ఏళ్ళుగా నాలోనె రగులుతున్న ఈ కసి అత్యంత సులభం గా సేఫ్ గా తీర్చుకునే మార్గం నాకు ఇప్పుడు దొరికింది. ఇ హ హ్హ హ్హా హ్హా (మనసులో) ఇప్పుడు నా అమెరికా కబుర్లు అన్ని ఇక్కడ చెప్పేస్తాను. అప్పుడే నా మనసుకు శాంతి !


******* ఇది అంతం కాదు ఆరంభం !!! ******************