Wednesday, October 21, 2009

చీకటి వెలుగుల తెల్ల పులి !

మొన్న దీపావళి కి ముందురోజు సాయంకాలం, అప్పుడప్పుడే చీకటి పడుతూంది. నేను కిచెన్ లో వంట మొదలు పెట్టాను. ఆరోజు మాతొ గడపడానికి ఇంటికి వచ్చిన ఫ్రెండు బాల్కనీలో నుంచుని వెనక వీధి లో పిల్లలు టపాకాయలు కాలుస్తుంటే చూస్తూ, నాకు కావాలీ అని గోల చేస్తుంది. సరే సంగతేంటో చూద్దాం అని నేను కూడా వెళ్ళాను. మేము రెండో ఫ్లోర్లో ఉండటం వల్ల, మా ఇల్లు వీధి చివర అవటం వల్ల, ఇంకా, మా ఇంటి ప్రక్క అంతా ఖాళీ జాగా ఉండటం వల్ల, మాకు చాలా మంచి వ్యు కనిపిస్తూ ఉంటుంది బాల్కనీ నుంచి. మా ఇంటి వెనక వీధి లో ఆఖరు ఇల్లు, పెద్ద బంగళా లాగ ఉంటుంది. వాళ్ళ పిల్లలు, ఒక పాప ఏడెనిమిదేళ్ళు ఉంటాయేమొ, ఇంకో చిన్న పాప సంవత్సరం పిల్ల. పెద్దమ్మాయి కాకరపువ్వొత్తులూ, చిచ్చిబుడ్డీలు, భూచక్రాలు కాలుస్తుంటె, చిన్నపాప అక్క వెనకాలే తిరుగుతూ ఉంది. బాగా చూడ్డానికని బాల్కనీ చివరకు వెళ్ళాం. మా ఫ్రెండు సడ్డెన్ గా నా చేయి పట్టుకుని రూత్, అటు చూడు అంది. మా ఇంటి పక్క ఖాళీ స్థలం లో ఉన్న గుడిసెల వాళ్ళ పిల్లలు, రోడ్డు వారగా నుంచుని చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కాని చాలా మంది ఏడిచినా లాభం లేదు అన్న విషయం అర్ధం అయినట్టుగా నుంచుని ఉన్నారు. ఇద్దరం ఒక నిముషం మౌనం గా ఉండిపోయాం. రోడ్డు కి ఒకవైపు బంగళా, నవ్వులు, వెలుగు...... రోడ్డు కి మరోవైపు గుడిసెలు, కన్నీళ్ళు, చీకటి.

సరిగ్గా ఆ సమయం లో ఆ పిల్లల మనస్సుల్లో ఏమవుతుందో నేను గ్రహించగలను కాని ఆ చిన్న మెదడుల్లో ఏమవుతుందో ఎవరికి తెలుసు? కాని ఇదే విషయాన్ని ఎంతో నేర్పుతో, ఓర్పుతో చెప్పిన పుస్తకం- ఈ మధ్య వచ్చిన " ద వైట్ టైగర్"(The White Tiger). అసలు నాకు సమకాలీన భారతీయ ఆంగ్ల సాహిత్యం (contemporary indian english litarature) మీద అంత సదభిప్రాయం లేదు. అందులోనూ అవార్డ్లొచ్చిన వాటి మీద అస్సలు లేదు. గతంలో చదివిన రెండు పుస్తకాలూ, అరుంధతీ రాయ్ - "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" (god of small things) మరియు కిరన్ దేసాయ్ -" ద ఇన్ హెరిటన్స్ ఆఫ్ లాస్"(the inheritance of loss ), నన్ను బాగా నిరాశపరిచాయి. కాని అరవింద్ ఆదిగ రాసిన " ద వైట్ టైగర్" మాత్రం తప్పకుండా చదవదగ్గ పుస్తకం. IT బూం చూసి, పెరుగుతున్న SEZలు చూసి, సెన్సెక్స్ పట్టికలు చూసి, గొప్పగొప్ప వాళ్ళు వాళ్ళ భార్యలకి గాల్ ఫ్రెండ్స్ కి ఇస్తున్న బహుమతులు చూసి, ఇంకా బాలివుడ్ సినీమాల బడ్జెట్లు చూసి, ఆహా భారత్ వెలిగిపోతోంది అని అనుకునే వాళ్ళకు ఈ పుస్తకం ఒక కనువిప్పు.అర్ధరాత్రుళ్ళు సైతం మిల మిలా వెలుగులు విరజిమ్ముత్తూ పట్టపగలును తలపించే ఆఫీసులతోపాటు, మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం కూడా చిమ్మచీకటిలో ఉండే గ్రామాలున్నాయని గుర్తుచేస్తుందీ పుస్తకం. అంతే కాదు, ఇలాంటి గ్రామాలని అశ్రద్ధ చేస్తే వచ్చే పరిణామాలను కూడా తన శైలిలో చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది.

బల్రాం హల్వాయి, బీహార్లోని ఒక కుగ్రామంలో పుట్టిన తెలివైన అబ్బాయి. తండ్రి ఒక రిక్షా పుల్లర్, తల్లి చనిపోయింది. అబ్బాయిని స్కూల్కి పంపించినా, తండ్రి హటాన్మరణంతో చదువు మానిపించి, ఊర్లోని టీకొట్లో ఉద్యోగానికి పెడుతుంది నానమ్మ. టీకొట్లో పనిచేసేటప్పుడే జీవితంలో పైకిరావాలంటే ఏంచెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు బల్రాం. తరువాత పక్క ఊరిలోని హోటల్ లో పని చేయటానికి వెళ్తాడు కుటుంబంలోని ఇతర అబ్బాయిలతోపాటు. అక్కడ గమనిస్తాడు, చీకటిలోనుంచి వెలుగులోనికి రావటానికి ఒక తెలివైన దారి డ్రైవర్ పని అని. అన్నని, నానమ్మని ఒప్పించి డ్రైవింగ్ నేర్చుకుంటాడు. అదే ఊళ్ళో ఉంటున్న తన గ్రామ పెద్ద ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన గ్రామపెద్ద చిన్న కొడుకు కోడలితో కలిసి ఢిల్లి వెళతాడు. కాని ఢిల్లీ వెళ్ళగానే సంబరపడటానికిలేదనీ, ఢిల్లీ వెలుగులోనే ఉన్నా, అక్కడకూడా చీకటికోణాలు ఉన్నాయని, తనలాంటి డ్రైవర్లందరూ ఇలాంటి చీకటికోణాల్లోనే ఉంటారని తెలుస్తుంది. ఐతే, తనుకూడా అసలు సిసలు వెలుగులోనికి రావటానికి ఏం చేసాడో, అందుకు ఏమేమి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడో, వాటిగురించి తన అభిప్రాయాలేంటో తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే మరి.

ఈ పుస్తకం గురించి నాకు నచ్చిన ఇంకొన్ని విషయాలు: పుస్తకం మొత్తం ఎక్కడా బిగి సడలకుండా మంచి పేస్ తో నడుస్తుంది. అస్సలు విసుగనిపించదు. వెలుగు, చీకటి అన్న (Light and Darkness) మెటాఫోర్ ఉపయోగించిన విధం చాలా హత్తుకునేలా ఉంది. నేను పుస్తకం చదివేటప్పుడు రచయిత ఏం చెప్తున్నాడు అనేదాన్ని గ్రహించినా, దాని ప్రతిసారీ ఆమోదించను. కాని, ఈ పుస్తకంలో రచయితే చాలా తటస్థంగా (neutral) ఉన్నాడు. బల్రాం చేసిన పని మచిదా కాదా, తనని ఎలా అర్ధం చేసుకోవాలి, అనేది పాఠకుడి కే వదిలేసాడు అనిపించింది. ఇక్కడ బల్రాం ఒక హీరో కాదు, విలన్ కూడా కాదు. ఒక మనిషి అంతే. ఈ మనిషిని హీరో ని చేసినా, విలన్ ని చేసినా అది పాఠకుడి ఇష్టం.

7 comments:

మురళి said...

నేను చదువుదాం అనుకుని, అవార్డు వచ్చిందని భయపడి చదవడం మానేసిన పుస్తకం అండీ ఇది.. 'గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' ఇంకా పూర్తి చేయలేదు నేను :( ..అయితే 'వైట్ టైగర్' చదవాల్సిందే అన్నమాట! చదివాక ఒక టపా రాస్తాను..

Ruth said...

ఓ తప్పకుండా రాయండి. నేను చూస్తూ ఉంటాను మీ సమీక్ష కోసం.

జయ said...

రూత్ గారు, మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. తప్పకుండా 'వైట్ టైగర్ ' చదవాల్సిందే.

హరే కృష్ణ said...

పరిచయం చేసిన విధానం బావుంది ..Reality కి నిదర్శనం..అవార్డ్ వచ్చినాకనే చదివా ఇది

Ruth said...

@జయ గారు, చాలా ధన్యవాదాలు. నేను ఈ పుస్తకం చదివి మూడు నెల్లైంది. కాని మొన్న దీపావళి రోజు చూసిన విషయంతో మళ్ళీ గుర్తువచ్చింది. అందుకే ఆ విషయం కూడా మెన్షన్ చేసాను.
@ హరే కృష్ణ గారు, చాలా ధన్యవాదాలు. పుస్తకం మీకు నచ్చిందనే అనుకుంటున్నా :)

కొత్త పాళీ said...

Interesting.
I had exactly the opposite reaction to both White Tiger and God of Small Things from your reaction :)

Ruth said...

హ్మ్మ్... పుస్తకం.నెట్ లో మీ రివ్యూ చదివినట్టు గుర్తు. అప్పుడు అనుకున్నా... కామెంట్ చేద్దామంటే అప్పటికే చాలా రోజులైంది. పోనిలెండి అందరూ ఒకేలా ఆలోచిస్తే అస్సలు మజా ఉండదు కదా. అస్సలు ఇంకా చాలా పెద్ద రివ్యూ రాయాలి అనుకున్నా, కాని తెలుగు బ్లాగులో ఇంగ్లీష్ బుక్ గురించి ఎందుకని వదిలేసా.
బూక్ రివ్యూస్ కోసమనే ఒక బ్లాగ్ ఉంది నాకు కాని నా బుక్స్ ఫ్రీక్వెన్సీ కి మేచ్ అవ్వక అది కంటిన్యూ చెయ్యటం లేదు. దాని సంగతి చూడాలి ఈ సారి.